136 మేడే జయప్రదం చేయండి

136 మేడే జయప్రదం చేయండి
ఐ ఎఫ్ టి యూ జిల్లా కోశాధికారి టి. తిరుపాల్
కర్నూలు టౌన్, ఏప్రిల్ 29, (PAWANIJAM NEWS) :
మోడీ ప్రభుత్వ కార్మిక వర్గ వ్యతిరేక విధానాలకు నిరసనగా 136 మేడే జయప్రదం చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ.ఎఫ్.టి.యు) జిల్లా కోశాధికారి టి. తిరుపాల్ పిలుపునిచ్చారు. అనంతరం స్థానిక కర్నూలు పట్టణంలో గోకారి భవన్ నందు 136వ మేడే గోడ పత్రికను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపాల్ మాట్లాడుతూ లేబర్ కోడ్స్ రద్దు, ప్రభుత్వరంగ పరిశ్రమల పరిరక్షణ, కనీస వేతనాలు అమలు, అసంఘటిత కార్మికుల సమగ్ర చట్టం కోసం పోరాడాలనే స్ఫూర్తితో 136వ మేడే ను జరపాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు చట్టబద్ధమైన ఎలాంటి హక్కులు లేవని ఫలితంగా కార్మికులు దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కనీస వేతనాలు, ప్రమాద బీమా పథకం,హమాలీ కార్మికులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని సౌకర్యాలకు నోచుకోక బానిస లాగా వెట్టిచాకిరి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడలుగా చేయడాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక లోకం ఉద్యమించాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.కార్మికులు తమ హక్కుల పరిరక్షణ కోసం సంఘటితంగా ఉద్యమించాలని, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 136 వ మేడే ను జరపాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల ఆటో మోటార్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అంజి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురేష్ నాయక్, రవి, గౌడ్, మాభాష, ఓబులేష్, సామేలు, మనోహర్, మహేష్, నిరంజన్, అనిల్, నాగరాజు మొదలైన వారు పాల్గొన్నారు.



