గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి

జీవితంలో గెలుపు ఓటమిలను సమానంగా స్వీకరించే తత్వం క్రీడల ద్వారా అలబడుతుంది .
తన పుట్టినరోజు సందర్భంగా కరాటే క్రీడాకారులకు బెల్ట్ ల ను ప్రధానం చేసిన సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ
కర్నూలు ప్రతినిధి ,జూన్ 26, (పవనిజం న్యూస్):
జీవితంలో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి ఎలాంటి ఒడిదుడు కులనైనా ఎదుర్కొనే తత్వాన్ని క్రీడలు పెంపొందిస్తాయని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని భాష్యం పాఠశాలలో తన పుట్టినరోజు సందర్భంగా కరాటే క్రీడాకారులకు ఆయన బెల్టులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో భాష్యం పాఠశాలల జోనల్ ఇంచార్జ్ అనిల్ కుమార్ ,ప్రిన్సిపల్ శ్రవణ్ కుమార్, ప్రధానోపాధ్యాయురాలు మాధవిజ్ సీనియర్ కరాటే శిక్షకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా భాష్యం పాఠశాలలో క్రీడాకారులకు బెల్టులను ప్రదానం చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. భగవంతున్ని చూడాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదని, నిష్కల్మష హృదయమున్న చిన్నారుల కళ్ళల్లో భగవంతుని చూడవచ్చని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరు సొంత లాభాన్ని కొంత మానుకొని పొరుగు వారికి సేవ చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. తాను వైద్య వృత్తిలో ఉన్నప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం ప్రవృత్తిగా మార్చుకుని ముందుకు సాగుతున్నానని వివరించారు. మొదట తాను చిన్న పిల్లల వైద్యుడిగా చిన్నారులకు సేవలు అందించానని, ప్రస్తుతం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ గా జీర్ణకోశ ,కాలేయ వ్యాధులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో సాధన చేయడం వల్ల మానసిక ,శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. ఈ క్రీడలో సుదీర్ఘంగా శ్వాస తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా అనేక ఉపయోగాలు ఉన్నాయని వివరించారు .ఇందులో ధ్యానం, ప్రాణాయామం వంటి ఆరోగ్యాన్ని పెంపొందించే అంశాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఇటీవల కాలంలో సరైన వ్యాయామం లేకపోవడం వల్ల జీవన శైలికి సంబంధించిన అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు, అధిక బరువు ,బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు చాలా మందిలో వస్తున్నాయని వివరించారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక వత్తిళ్లు తగ్గించుకొని ఆరోగ్యకరంగా జీవించవచ్చు అని తెలిపారు .ముఖ్యంగా క్రీడల్లో పాల్గొనేవారు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే తత్వాన్ని అలవర్చుకుంటారని, ఫలితంగా జీవితంలో ఎలాంటి వైఫల్యాలు ఎదురైనా తట్టుకునే శక్తి పెంపొందుతుందని చెప్పారు. చాలామంది చిన్న చిన్న వైఫల్యాలకు ఆత్మహత్యలు వంటి విపరీత నిర్ణయాలకు సిద్ధపడుతున్నారని, క్రీడల్లో పాల్గొనడం వల్ల ఇలాంటి నిర్ణయాలకు దూరంగా ఉండవచ్చని వివరించారు. ఏ దేశ భవిష్యత్తు అయినా యువతపై ఆధారపడి ఉంటుందని, ప్రపంచంలో యువత అధికంగా ఉన్న దేశం మన దేశం మాత్రమేనని అని తెలిపారు. రానున్న రోజుల్లో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఎదుగుతుందని ఆయన వివరించారు. ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాల్లో యుద్ధ వాతావరణం ఉందని అలాంటి యుద్ధ వాతావరణాన్ని నిలుపుదల చేసే శక్తి యువత అధికంగా ఉన్న భారతదేశం పై మాత్రమే ఉందని వివరించారు. భాష్యం పాఠశాలలో చిన్న పిల్లల మధ్య తన పుట్టినరోజును జరుపుకోవడం జరుపుకోవడం మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుందని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు.



