
వాలంటీర్ల సేవలు అభినందనీయం…
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి
ఆళ్లగడ్డ, (PAWANIJAM NEWS) :
వాలంటీర్ల సేవలు అభినందనీయమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కోట కందుకూరు, పాత కందుకూరు, ఆర్ కృష్ణాపురం గ్రామాలలో వాలంటీర్ల సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు. మండల పరిషత్ అధ్యక్షులు గజ్జెల రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం తోనే ప్రజలకు పారదర్శక పాలన అందుతుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయని అన్నారు. గతంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే జన్మభూమి కమిటీల ద్వారా సిఫారసు చేయాల్సి వచ్చేది అన్నారు. మన ప్రభుత్వంలో నేరుగా అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. సొంత గ్రామములోనే వృద్ధులకు సేవ చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. కోట కందుకూరు గ్రామానికి బైపాస్ రోడ్డు కావాలని ప్రజలు కోరుతున్నారని త్వరలోనే సాధ్యాసాధ్యాలు చూసి పనులు ప్రారంభిస్తామన్నారు. అలాగే లింగందిన్నె పొలాలకు వెళ్లేoదుకు కూడా పనులు చేపడతామన్నారు. స్వపరిపాలన, గ్రామ స్వరాజ్యం ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ రమేష్ రెడ్డి, ఎంపీడీవో సుబ్బారెడ్డి, ఈవోఆర్డి వెంకటేశ్వరరావు, వైసిపి నాయకులు గంగుల రామి రెడ్డి, నాగ శ్రీనివాసులు, కొలిమి దాదాపీర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.