
గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలి…
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ, (PAWANIJAM NEWS ) :
క్రీడల్లో గెలుపు, ఓటములను సమానంగా తీసుకోవాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. పట్టణంలోని ఎద్దుల పాపమ్మ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా ఆమె బ్యాట్ తో క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమా శోభా నాగిరెడ్డి ట్రస్టు ద్వారా క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్నారు. తన తల్లి భూమా శోభానాగిరెడ్డి వర్ధంతిని (ఈ నెల 24 న) పురస్కరించుకొని జిల్లా స్థాయి కబడ్డీ, టెన్నిస్ బాల్, క్రికెట్, షటిల్ బ్యాట్మెంటన్ పోటీలను ఏర్పాటు చేశామన్నారు. తమ ట్రస్టు తరఫున క్రీడల పట్ల ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహిస్తామని, వారికి చేయూతనిస్తున్నామన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల పట్ల ఆసక్తి కనపరచాలని ఆమె సూచించారు. ఈ పోటీలు బుధవారం నుండి ఆదివారం వరకు జరగనున్నాయనీ, ఈ క్రీడా పోటీలలో 45 జట్లు పాల్గొన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి కౌన్సిలర్ హుస్సేన్ భాష, మాజీ జెడ్పిటిసి చాంద్ భాషా, టిడిపి నాయకులు బాచ్చాపురం శేఖర్ రెడ్డి, సోముల శేఖర్ రెడ్డి, పాపిరెడ్డి, అనంత విద్యాసంస్థల అధినేత రామసుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.